ఎన్నికల నిర్వహణకు రూ. 308 కోట్లు | Election Commission advances electoral rolls revision | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు రూ. 308 కోట్లు

Published Mon, Sep 10 2018 2:26 AM | Last Updated on Mon, Sep 10 2018 8:43 AM

Election Commission advances electoral rolls revision - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రకాల అనుమతులు, వనరుల సమీకరణ కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఎన్నికల నిర్వహణ ఖర్చుల కోసం రూ.308 కోట్ల నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషికి ప్రతిపాదనలు పంపారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించే జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు ఎన్నికల సంఘం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఒక్కో బ్యాచ్‌లో 50 మంది చొప్పున రోజుకు రెండు బ్యాచ్‌లుగా నాలుగు రోజుల్లో 650 మందికి శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో పాసైన అధికారులనే రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా నియమించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని జిల్లాల్లో రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల నియామకం దాదాపు పూర్తయింది. ఇటీవలి బదిలీల్లో ఒకట్రెండు చోట్లలో కొందరు అధికారులు బాధ్యతలు స్వీకరించకపోవడంతో త్వరలో ఆయా స్థానాలనూ భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.

ఈసీ బృందం నివేదిక కీలకం...
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా నేతృత్వంలో 8 మంది అధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌ చేరుకోనుంది. అదేరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై సలహాలు, అభిప్రాయాలు సేకరించనుంది. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల ఏర్పాట్లపై ఈ బృందం ఎదుట పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.

12న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం సమావేశమై ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యాక్రమం నిర్వహణ, ఎన్నికలకు సంసిద్ధతపై ఆరా తీయనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ ప్రభుత్వశాఖల కార్యదర్శులతో సమావేశం కానుంది. ఈ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.  


పరిశీలన తర్వాతే ఈవీఎంల వినియోగం..
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) సమీకరణ సరఫరా సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికల నిర్వహణ కోసం 44 వేల ఓటరు ధ్రువీకృత రశీదులు (వీవీ ప్యాట్‌) యూనిట్లు, 40,700 కంట్రోల్‌ యూనిట్లు, 52 వేల బ్యాలెటింగ్‌ యూనిట్లు వారంలోగా రాష్ట్రానికి చేరుకోనున్నాయి. ఓటింగ్‌ యంత్రాలు ఎక్కడున్నాయో భవిష్యత్తులో ట్రాకింగ్‌ చేసేందుకు వీలుగా వాటిని ఈవీఎం ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ (ఈవీఎస్‌)లో నమోదు చేయనున్నారు.

అన్ని పార్టీలు, మీడియా ప్రతినిధుల సమక్షంలో ఎన్ని కల సంఘం ఈవీఎంలకు ప్రాథమిక స్థాయి పరిశీలన(ఎఫ్‌ఎల్‌సీ) జరపనుంది. డమ్మీ ఈవీఎంలకు వీవీ ప్యాట్‌ యంత్రాన్ని అనుసంధానించి పనితీరును పరిశీలించనుంది. ఈవీ ఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఎన్నికల్లో వినియోగిస్తామని రజత్‌ కుమార్‌ ఆదివారం సచివాలయంలో విలేకరులకు తెలియజేశారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతల అంశంపై పోలీసుశాఖ, ఎన్నికల సంఘం మధ్య సమన్వయకర్తగా పనిచేసేందుకు నోడల్‌ అధికారిని త్వరలో నియమించనున్నారు. డీజీపీ ప్రతిపాదించిన ఐపీఎస్‌ అధికారి పేరును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా ఏపీలో ఒకటి రెండు చోట్లలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయని, తెలంగాణలో మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement