సాక్షి, ఎలక్షన్ డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో ధన ప్రభావం ప్రబలంగా ఉండే 110 నియోజకవర్గాలను ఎన్నికల సంఘం గుర్తించింది. ఇక్కడ రాజకీయ పార్టీలు డబ్బులు పంచడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తమిళనాడులోని మొత్తం లోక్‌సభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సగానికిపైగా నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావం బలంగా ఉందని ఎన్నికల సంఘం వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
ఈ నియోజకవర్గాల్లో డబ్బు ప్రభావాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం కోసం ఎన్నికల సంఘం ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు నిపుణులను పంపుతోంది. ఈ నిపుణులు ఏర్పాటు చేసే ప్రత్యేక బృందాలు ఆయా నియోజకవర్గాల్లో నగదు రవాణాపై నిఘా పెడతారు. అక్రమంగా రవాణా అయ్యే నగదును స్వాధీనం చేసుకుంటారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధానాధికారులు పంపిన సమాచారం ఆధారంగా ఎన్నికల సంఘం ఈ 110 నియోజకవర్గాలను గుర్తించింది.
అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం అందితే ఈ సంఖ్య 150 దాటవచ్చని ఆ పత్రిక పేర్కొంది. ఎన్నికల సంఘం కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీ డిపార్ట్‌మెంట్ ఎలక్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ (ఎండీఐసీ) ఈ నియోజకవర్గాలపై పటిష్టమైన నిఘా పెట్టి అక్రమ నగదును స్వాధీనం చేసుకుంటుంది. ఉత్తరప్రదేశ్, అసోం, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చండీగఢ్‌లో ఇలాంటి నియోజకవర్గాలను ఇంకా గుర్తించ లేదని ఆ పత్రిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment