
మంత్రి ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌లను సత్కరిస్తున్న హమాలీ సంఘం ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలను ప్రతిపక్షాలు ఎప్పుడూ పట్టించుకోలేదని, వారి ధ్యాస ఎప్పుడూ అధికారంపైనే అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కూటమితో అధికారంలోకి రావాలనే ప్రతిపక్షాల కల నెరవేరదని చెప్పారు. హమాలీ కార్మికుల సంఘం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం కృతజ్ఞత సభ నిర్వహించింది. మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యఅతిధిగా ప్రసంగించారు. ‘టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హమాలీ చార్జీలను పెంచాం. యాభై ఏళ్లు పరిపాలించిన పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఆరోజుల్లో వేతనాలు పెంచాలని అడిగితే కేసులు పెట్టారు. తెలంగాణ ప్రజల జీవనాధారం వ్యవసాయం. అందుకే మేం 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక కోటి టన్నుల ధాన్యం పండుతుంది.
పౌరసరఫరాల సంస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. సంస్థ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో తమ గ్రామాలను కలపాలని కోరుతున్నారు. మా లక్ష్యం తెలంగాణ ప్రజల అభివృద్ధి. పదవులు ఎంతమాత్రం కావు. కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవి లేకపోతే ఉండలేరు. అందుకే కూటమిగా వస్తున్నారు. ఎప్పుడూ అధికారం, కుర్చీపైనే వారి ధ్యాస’అని ఈటల అన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, 70 ఏళ్ల వెట్టిచాకిరీని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వేతనాలు పెంచిందని అన్నారు. హమాలీల పిల్లల కోసం సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాల పెట్టి నాణ్యమైన విద్య అందిస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లలో తెలంగాణలో ప్రతి కుటుం బానికి ప్రభుత్వ పథకాలు చేరాయని అన్నారు. తెలంగాణలోని ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. హమాలీ కార్మికుల సంఘం అధ్యక్షుడు శ్రీనన్న, కార్యదర్శి ఉత్తంరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment