సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంటే బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు చిల్లరబొల్లరగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇది విమర్శలు చేసే సమయం కాదని హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఆదివారం మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోన విజృంభిస్తోందని గుర్తు చేశారు. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చిల్లర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కరోన కట్టడి లో తెలంగాణ విఫలం అయ్యిందని నడ్డా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఈటల విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోన కట్టడి ఎలా ఉందో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.
(చదవండి: కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ)
‘మార్చి 2 నుంచి రాష్ట్రంలో కరోనా జాడ బయట పడింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారి ద్వారానే కరోన సంక్రమిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడే చెప్పారు. దీనిపై స్పందించిన మొట్టమొదటి వ్యక్తి సీఎం కేసీఆరే. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్ చేసి చూపెట్టారు. బీజేపీ నేతలకు కంటైన్‌మెంట్ అన్న పదానికి అర్థం తెలియదు. మర్కజ్ విషయంలో కూడా ముందు హెచ్చరించింది సీఎం కేసీఆరే. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పుడు విమర్శలు అనవసరం అని ప్రధానికి సీఎం సూచనలు చేశారు. ఇప్పుడేమో బీజేపీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
జాతీయ స్థాయి నేతలు మాట్లాడే మాటలు కాదు ఇవి. గల్లీ స్థాయి లీడర్లు మాట్లాడే మాటలివి. లాక్‌డౌన్ సమయంలో చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అన్నప్పుడు ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నా మా సీఎం మాత్రం అన్నింటికీ సహకరించారు. రెడ్‌జోన్, కంటైన్‌మెంట్ జోన్లతో వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నాం. దానిని మీ కేంద్రమే మెచ్చుకుంది. దీన్ని కూడా తప్పు అంటున్నారు. మీది నీచ సంస్కృతి, మీది శవాల మీద పేలాలు ఏరుకునే స్వభావం. ఇలాంటి చిల్లర రాజకీయాలు తగదు’ అని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
(చదవండి: గాంధీలో మరో శవ పంచాయితీ)
Comments
Please login to add a commentAdd a comment