సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఆయన హస్తినకు బయలుదేరనున్నారు. దీంతో, హైదరాబాద్‌లో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే కిషన్‌రెడ్డి ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది. ఇక, అంతకుముందే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ఢిల్లీకి రావాలని సూచించడంతో ఇప్పటికే కోమటిరెడ్డి హస్తినకు వెళ్లారు. ఈటల కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, వీరిలో జేపీ నడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. జేపీ నడ్డా రేపు(ఆదివారం) తెలంగాణకు రానున్నారు.
సంజయ్ సమక్షంలో చర్చ
ఇదిలా ఉండగా.. నాగర్‌కర్నూల్‌లో నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్య గౌడ్ తదితరులు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డిల ఢిల్లీ పర్యటన చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. పలువురు సీనియర్లు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు నేతలతో సంజయ్ విడివిడిగా సమావేశమైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీని వీడాలనుకుంటే ఆపొద్దు..!
పార్టీలో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు చర్చకు వచ్చినపుడు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని సంజయ్‌కు కొందరు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు కాకుండా.. లీకులిస్తున్న నాయకులకే అగ్రనేతలు అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారంటూ ఓనేత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీని వీడాలనుకునే నాయకులను ఆపవద్దని సంజయ్‌కు సీనియర్లు చెప్పినట్లు సమాచారం. కాగా అధికార బీఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, బీఆర్‌ఎస్‌కు బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: శేజల్‌తో బీఆర్‌ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్!
Comments
Please login to add a commentAdd a comment