బలంగా వినిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడి పేరు
దేవేంద్ర ఫడ్నవీస్, ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల పేర్లూ
పరిశీలన.. దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎంపికకు అవకాశం
దక్షిణ భారతంలో పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యం
డిసెంబర్ చివరికి కొత్త అధ్యక్షుడి ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగిరం చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాల యూనిట్‌లను ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని, తద్వారా అక్కడ పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటా యని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ రెండ్రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో వర్క్‌షాప్ నిర్వహించి సంస్థాగత ఎన్ని కల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.
దక్షిణాదికే అవకాశమెక్కువ..
ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసినా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), సునీల్ భూపేంద్ర యాదవ్ (రాజస్తాన్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిశా)ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అయితే కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా, డిసెంబర్ రెండు లేదా మూడో వారానికి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధినాయకత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment