సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనేంత స్థాయి వరకు నేతలు గళం విప్పుతున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో అధికమౌతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం ఈ తరహా నేతల జాబితాలో ఉండటం గమనార్హం.
వారితో మాట్లాడి.. మమ్మల్ని విస్మరించారు!
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిలు అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఇటీవల వారిని ఢిల్లీ పిలిపించి బుజ్జగించింది. ఈ నేపథ్యంలో మరికొందరు ముఖ్యనేతలు.. తమ అసంతృప్తిని తెలుసుకునేందుకు నాయకత్వం ఎందుకు ప్రయత్నించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ద్వారా పార్టీకి పెద్ద ఊపు తెచ్చిన తనను ఎమ్మెల్యేగా, ముఖ్యనేతగా పరిగణించకుండా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రఘునందన్ ఫైర్..
రాష్ట్ర అధ్యక్షుడి తీరును, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి పలుమార్లు అమిత్‌షా, నడ్డాలకు తెలియజేసినా ఓపిక పట్టాలనే సూచన తప్ప సమస్య పరిష్కారానికి ఏ చర్యా తీసుకోలేదనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల, రాజ్‌గోపాల్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించారని, తనను మాత్రం పట్టించుకోలేదనే భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం. బీజేఎల్పీ నేత రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత తనకు శాసన సభాపక్షపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించి తనను విస్మరించడం, పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఆశించినా అవి జరగకపోవడం రఘునందన్‌లో అసంతృప్తిని మరింత పెంచిందని అంటున్నారు.
తన కార్యకర్తలు, అనుయాయులు వెలిబుచ్చుతున్న అసంతృప్తినే తాను బయటకు చెబుతున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి రాష్ట్ర బీజేపీపై వ్యంగ్య ధోరణిలో ఓ ప్రతీకాత్మక వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయడం పారీ్టలో దుమారాన్నే రేపింది. దున్నపోతును వెనుకనుంచి తన్ని వ్యాన్‌లోకి ఎక్కించే వీడియో పోస్ట్ చేసి, రాష్ట్ర నాయకత్వానికి ఇలాంటి చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించడంపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
నేరుగా నడ్డా దృష్టికి..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగానూ పలువురు నాయకులు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించక పోవడంపై అసంతృప్తిని తెలియజేశారు. జాతీయ కార్యవర్గసభ్యులు డా.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వేర్వేరుగా నడ్డాను కలుసుకుని వివిధ అంశాలపై తమ అసంతృప్తికి గల కారణాలను తెలియజేశారు. రాష్ట్ర పార్టీలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులతో నాయకులు సమైక్యంగా లేరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం, పార్టీలో సమష్టి నిర్ణయాలు కొరవడడంతో నష్టం జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు.
తీవ్ర అసంతృప్తి..
పలు సందర్భాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను సంప్రదించకుండానే ముఖ్య నేతల భేటీలో నిర్ణయమంటూ ప్రకటనలు వెలువడుతున్నాయని నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. తాము జాతీయ కార్యవర్గ సభ్యులుగా, మాజీ ఎంపీలుగా, ఉద్యమకారులుగా ఉన్నా తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వడం లేదని, నష్టం కలుగజేసేలా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వంటి వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలపై జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీలో చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: చర్చనీయాంశంగా.. సామేలు రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment