
సాక్షి, కరీంనగర్ : ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చే వాళ్లు ఉంటారు..పోయే వాళ్లు ఉంటారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల కమీషన్ 20పైసల నుంచి 70పైసలకు పెంచామని, సెప్టెంబర్1 నుంచి అది అమల్లోకి వస్తుందన్నారు. దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మేలు చేసిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 55 నుంచి 60కుల సంఘాల భవనాలకు ఐదు కోట్లు, ఐదెకరాల స్థలం కేటాయించామన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదిక సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా చేస్తుందన్నారు. ప్రగతి నివేదిక సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 3వేల బస్సులు, వెయ్యికి పైగా ట్రాక్టర్‌లు, వేల సంఖ్యలో కార్లు, సుమోలలో జనం తరలివస్తారని పేర్కొన్నారు.