
సాక్షి, నూజివీడు : ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీఎంల భద్రత విషయంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. నూజివీడు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తహసీల్దారు పి.తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది.
కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు కొద్దిరోజుల క్రితమే షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా వీటికి ఎందుకు తరలించారనే దానిపై పైఅధికారులు విస్తృత విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు వివాదం, ఈవీఎం స్ట్రాంగ్ రూంలో అనధికారిక వ్యక్తుల ప్రవేశంపై మరో ఇద్దరు అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.