సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ మంత్రికి మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో ఎఐఎడిఎంకెకు చెందిన మాజీ మంత్రి సత్యమూర్తికి, ఆయన భార్యకు జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. మాజీ మంత్రి సత్యమూర్తికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. అలాగే ఆయన భార్యకు రెండేళ్ల శిక్ష విధించింది. దీంతోపాటు ఇద్దరూ రూ. 5లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ జరిమానా చెల్లించడంలో విఫలమైతే ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరం జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.
ఈ కేసులో ఆగస్టు, 2000లో సత్యమూర్తిని, ఆయన భార్యను నిర్దోషులుగా నిర్ధారించి దిగువ కోర్టు విడుదల చేసింది. తాజాగా ఈ తీర్పును కొట్టివేసిన జస్టిస్ జి.జయచంద్రన్ ఈమేరకు సంచలన తీర్పునిచ్చారు. విజిలెన్స్ డైరెక్టరేట్ అండ్ యాంటీ కరప్షన్ శాఖ దాఖలు చేసిన అప్పీల్‌ను సమర్ధించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం యొక్క సెక్షన్ 13 (1) (ఇ) కు సంబంధించిన వివరణను కింది కోర్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో 1993-1996 మధ్య వాణిజ్య పన్నుల మంత్రిగా సత్యమూర్తి పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment