
మరికొద్ది రోజులే సమయమున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తోన్న అభ్యర్థులకు ఫేస్‌బుక్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ప్రచారానికి అభ్యర్థులకు అతి తక్కువ సమయమే ఉంది. తక్కువ సమయంలో అన్ని ప్రాంతాలనూ అభ్యర్థులు కవర్ చేయలేకపోవచ్చు. అలాంటి వారికి ఫేస్‌బుక్‌లో ‘క్యాండిడేట్స్ కనెక్ట్’ ఫీచర్‌తో ప్రజల్లోకి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఫలానా పార్టీకి చెందిన అభ్యర్థులు ఏం చెబుతున్నారో.. సదరు నియోజకవర్గానికి చెందిన ఓటరు తన ఇంట్లో ఉండే తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఒక అంచనాకు వచ్చి తన ఓటుని సద్వినియోగం చేసుకునే వీలు కూడా కలుగుతుంది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ఈ సువర్ణావకాశానికి శ్రీకారం చుట్టింది. లోక్‌సభకు పోటీ చేస్తోన్న అభ్యర్థులందరూ వారి వారి ఎన్నికల హామీలను 20 సెకండ్లకు మించకుండా వీడియో రికార్డు చేసి ‘క్యాండిడేట్ కనెక్ట్’ ద్వారా ప్రజల్లోకి వెళ్లే వీలు కల్పించింది.
పౌరులందరికీ అందరి గురించీ తెలుసుకునే వీలు కల్పించాలని భావించామనీ, ఓటర్లకు సైతం విజువల్ గైడ్‌గా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ డైరెక్టర్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ఫర్ సివిల్ ఇంటిగ్రిటీ సమిధ్ చక్రవర్తి వెల్లడించారు. ఇప్పటికే తప్పుడు వార్తలతో, ఫేక్ న్యూస్‌తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న ఫేక్ ఎకౌంట్స్‌ని ఫేస్‌బుక్ నుంచి తొలగిస్తోందనీ, రాజకీయ ప్రకటనల విషయంలోనూ పారదర్శకతకు ఫేస్‌బుక్ ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితంగా అభ్యర్థుల అభిప్రాయాలను వారి వారి నియోజకవర్గాల్లోని ఓటర్లు నేరుగా వినే అవకాశాన్ని కల్పించాలని ఫేస్‌బుక్ ఈ ఆవిష్కరణకు పూనుకుందన్నారు. దీనికోసం అభ్యర్థులకు నాలుగు ప్రశ్నలు వేస్తుంది. ప్రతి అభ్యర్థీ వీడియో ద్వారా తన సమా«ధానాన్ని 20 నిమిషాలకు మించకుండా చెప్పాలి. అయితే ఎన్నికల కమిషన్ నుంచి సేకరించిన అభ్యర్థుల జాబితాతో కేవలం లోక్‌సభ సభ్యులకు మాత్రమే ఫేస్‌బుక్ ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చక్రవర్తి చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీకి దిగిన అందరు సభ్యుల వీడియోలనూ ఒక నిర్దిష్ట సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు చూసే అవకాశం కల్పిస్తారు. అయితే ప్రజలు ఇతర ప్రాంతాల, జిల్లాల అభ్యర్థుల వీడియోలను సైతం ఆయా నియోజకవర్గాల సమయానుసారం చూసే వీలుంటుంది.