
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం ఎంపీలతో సమావేశం పెట్టి ప్రాధాన్యత గలిగిన అంశాలపై మాట్లాడకపోవడం బాధాకరం. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వస్తే ఆయన కారు దిగగానే టీఆర్‌ఎస్ ఎంపీలు గజగజ భయపడే పరిస్థితి. ఏ ఎంపీ రాష్ట్ర ప్రయోజనాలపై విజ్ఞప్తి చేసే పరిస్థితి లేదు.
మొత్తంగా అందరూ వ్యాపారస్తులై ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు’ అని వ్యాఖ్యానించారు. ఎయిమ్స్‌కు నిధులు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని పేర్కొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని అడిగితే టీఆర్‌ఎస్ ఎంపీలు తలదించుకునే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనలోగానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలోగానీ పురోగతి లేదని విమర్శించారు.