
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి క్షేత్రస్థాయి నాయకులకు గౌరవం లేకుండా చేసిన టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా స్థానిక సంస్థల బలోపేతానికి సహకరించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారంజరగనున్న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
10 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన, అంబేడ్కర్ జయంతి నాడే ఆయన విగ్రహాన్ని ముక్కలు చేసిన, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన, కేబినెట్‌లో స్థానం ఇవ్వకుండా తెలంగాణ మహిళలను అవమానపరచిన టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేయవద్దని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.