
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై సమాలోచనలు సాగుతుండగానే సోషల్ మీడియాలో తొలి జాబితా విడుదల కావడం పార్టీలో కలకలం రేపింది. సోషల్ మీడియాలో వచ్చిన జాబితా నకిలీదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రాథమిక జాబితాతో హైకమాండ్‌తో స్క్రీనింగ్ కమిటీ మంగళవారం తుదివిడత చర్చలు జరిపినా కేంద్ర ఎన్నికల కమిటీ గ్రీన్‌సిగ్నల్ లభించక ముందే తొలి జాబితా వెల్లడి కావడం పట్ల పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. తొలి జాబితా విడుదలైందన్న వార్తలతో అయోమయానికి గురైన పార్టీ శ్రేణులకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్ వివరణ ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత జాబితాను ఏఐసీసీ ప్రకటించిందని అభ్యర్ధుల పేర్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితా నకిలీదని చెప్పారు. ఈ జాబితాను ఏఐసీసీ విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమైన అనంతరమే జాబితా విడుదలవుతుందని, ఇప్పటి వరకూ సీఈసీ భేటీ కాలేదని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధుల ఖరారుకు సంబంధించి డీసీసీలు, పరిశీలకులు, రాష్ట్ర కమిటీ సిఫార్సులను వడపోసి గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు కోరడం వివాదాస్పదమైంది.