
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..నిన్న(ఆదివారం) తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశం అయితే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారని ఎల్లోమీడియా ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను అణదొక్కుతున్నారని పార్ధసారధి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు వందకుపైగా హామీలిచ్చి ఇప్పుడు మిన్నకుండిపోయారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలలో ఇప్పటివరకూ ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. అధికారాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జస్టిస్ ఈశ్వరయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అది తేట తెల్లమైందన్నారు. తప్పుడు నివేదికలు ఎలా తయారు చేస్తారని సూటిగా ప్రశ్నించారు. బలహీనవర్గాలు, దళితుల అవకాశాలను గండికొడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బలమైన పోస్టు ఏ ఒక్కటైనా బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. తప్పుడు నివేదికలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment