
నిజామాబాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్): ఉద్యోగులకు సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానం అమలుకు కేంద్రంతో పోరాడుదామని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో టీఎన్జీవోస్ నాన్‌గెజిటెడ్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ఉద్యోగులు ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. టీఎన్జీవోస్ సంఘానికి టీఆర్‌ఎస్‌కు వీడదీయరాని బంధం ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న సీపీఎస్ రద్దుకు కలసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో చురుకైన పాత్ర పోషించాలని ఎంపీ కవిత సూచించారు.