
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని కోరారు.
బతుకమ్మ సందర్భంగా ట్విటర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత సందేశం
కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘బతుకమ్మ పండుగ స్పూర్తితో మనందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందాం. ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడకూడదు. కరోనా కారణంగా ఈ ఏడాది, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.’ అని ట్విటర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక సందేశం విడుదల చేశారు.
మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 16, 2020
ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు#MyBathukammaMyPride pic.twitter.com/FUdjZNecBt