
బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్(పాత చిత్రం)
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఘోరంగా తయారైందని, వెంటనే శాసనసభ వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు. విలేకరులతో మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీకి సంబంధించిన చెల్లింపులను ప్రభుత్వం ఆపేసిందని తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ల చెల్లింపులు కూడా ఆగిపోయాయని అన్నారు. ఆర్ధిక మాంద్యం వల్ల సంక్షేమం పడకేసిందని చెప్పారు. కొత్త పథకాల వల్ల పాత పథకాలకు డబ్బుల్లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు.
వైద్యశాఖలో అవినీతి ఏరులై పారుతోందని, ఎంసెట్ స్కాంకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, దానికి పరిపూర్ణానంద స్వామిజీ నగర బహష్కరణే నిదర్శనమన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాల పరిస్థితులపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. మహాభారతం, రామాయణంపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. నారాయణ కామెంట్స్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందింస్తుందో వేచి చూస్తామని వెల్లడించారు.