
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రి తెలిపింది. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ప్రస్తుతం ఆయనకు యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని తెలిపింది. వాజపేయి కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, ఇన్‌ఫెక‌్షన్ తగ్గేవరకు ఆయన ఆస్పత్రిలో ఉండాలని ఎయిమ్స్ ఆస్పత్రి మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది.
సోమవారం ఉదయం అనారోగ్యానికి గురికావటంతో వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తొలుత రొటీన్ చెకప్‌లో భాగంగా వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలించినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఆయన మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు తాజాగా తెలిపారు. వాజ్‌పేయికి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందచేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించి, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ కాన్పూర్‌లో కమలం పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహించారు.