
కోల్‌కత్తా: బీజేపీ ప్రతినిధి బృందం పర్యటనతో పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్‌పరా ప్రాంతంలో పరిస్థితి సమీక్షించేందుకు కాషాయబృందం పర్యటించింది. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించడంతో పాటు స్థానికులతో మాట్లాడి ఘటన వివరాలు సేకరించేందుకు బీజేపీ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి ఎస్‌ఎస్ అహ్లువాలియీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ శనివారం భట్‌పరా చేరుకుంది. ఈ నేపథ్యంలో కమలం కార్యకర్తలు, స్థానికులు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. బెంగాల్ పోలీసులు, మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే 144వ సెక్షన్ అమల్లో ఉండడంతో పోలీసులు వారిని తరమికొట్టారు. బీజేపీ కార్యకర్తలు కొందరు 'బెంగాల్ పోలీస్ హే హే', 'మమతా బెనర్జీ హే హే' అంటూ నినాదాలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు లాఠీలు ఝళిపించారు. దీంతో భట్‌పరాలో ఉద్రిక్తత పెరిగింది.
ఏడుగురు అమాయకులపై పోలీసులు అన్యాయంగా కాల్పులు జరిపారని.. ఇది దారుణమైన విషయమని అహ్లువాలియా ఆవేదన వ్యక్తంచేశారు. బెంగాల్‌లో పెచ్చుమీరిన రాజకీయ హింస యావత్ దేశానికే ప్రమాదకరమన్నారు. న్నికలు పూర్తయ్యాక కూడా బెంగాల్‌లో హింస కొనసాగడం బాధాకరమన్నారు. దీనిపై అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారని... రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారని తెలిపారు. ఇక్కడి పరిస్థితులపై బీజేపీ చీఫ్, కేంద్రహోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇవ్వనున్నట్టు అహ్లువాలియా తెలిపారు.
కాగా సార్వత్రిక ఎన్నికల సమయంలో చెలరేగిన హింసా.. బెంగాల్ వ్యాప్తంగా తీవ్ర రూపందాల్చిన విషయం తెలిసిందే. దీంతో అనేక ప్రాంతాల్లో ఘర్షణల కారణంగా బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కొల్పొతున్నారు. బెంగాల్ వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు బెంగాల్ ఘర్షణలకు బీజేపీయే కారణమంటూ దీదీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా చోటుచేసుకున్న ఘటనలపై అహ్లువాలియా కమిటీ అమిత్‌షాకి నివేదికను ఇవ్వనుంది.