సాక్షి, తాడేపల్లి : చంద్రబాబుకు ధైర్యం ఉంటే కోడెల టాక్స్, లోకేష్ టాక్స్‌పై శిబిరాలు పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. పల్నాడులో చిన్న చిన్న గొడవలు జరిగితే వాటికి రాజకీయ రంగు పులుముతూ శిబిరాలు పెడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉండగా టీడీపీ నేతలు అనేక అరాచకాలకు పాల్పడ్డారని.. టీడీపీ బాధిత శిబిరం పెడితే కరకట్ట మొత్తం నిండిపోతుందన్నారు. టీడీపీ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రాజధాని మార్చుతున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న 45 ఏళ్ల వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని.. అందుకే సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా తన మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష కోట్ల బిల్లులు పెండింగులో పెట్టిన చంద్రబాబు రెండున్నర కోట్లు లక్షల అప్పు భారాన్ని రాష్ట్రంపై మోపారని దుయ్యబట్టారు. అదే విధంగా నాడు ప్రతిపక్షాన్ని విమర్శించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన అవినీతిపై ఎందుకు ట్వీట్లు చేయడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు.
వాళ్లను చంపించింది మీరే
‘రాజకీయం కోసం చంద్రబాబు ప్రభుత్వమే వైఎస్ జగన్ బాబాయిని చంపించింది. వంగవీటి మోహన్ రంగాను, చివరికి మీడియా ప్రతినిధులను చంపించావు. వైఎస్సార్‌సీపీ నేత చెరుకూరి నారాయణరెడ్డిని టీడీపీ నేతలు హత్య చేయలేదా. గతంలో ఇడుపులపాయలో డ్రోన్ కేమెరాతో ఫొటోలు తీయలేదా’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన చరిత్ర టీడీపీ నేతలది. చిన్న చిన్న గొడవలకు రాజకీయ రంగు పులుముతున్నారు. వాటిపై శిబిరాలు పెడుతున్నారు. పల్నాడులో మాజీ టీడీపీ ఎమ్మెల్యేలు యరపతినేని, కోడెల అరాచకాలకు పాల్పడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద చంద్రబాబు శిబిరం నిర్వహించగలరా. చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాల్లో చర్చ పెడదాము. జన్మభూమి కమిటీ అరాచకాలు మీద చర్చ పెడదాము. దానికి చంద్రబాబు సిద్దమా’ అని సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలో ఉండగా అరాచకాలకు పాల్పడ్డ ఆ పార్టీ నేతలు కూన రవి, చింతమనేని ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు టీడీపీలోనే ఉన్నారని ఘాటుగా విమర్శించారు.
పబ్లిసిటీకి దూరంగా సీఎం జగన్ పాలన
‘ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీఎం స్పందన కార్యక్రమం పెట్టారు. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరిని సమానంగా చూడమని కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు కల్పించారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా, పబ్లిసిటీకి దూరంగా సీఎం పరిపాలన చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదు. త్వరలోనే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ విషయంలో సమర్ధవంతమైన అధికారులు పనిచేస్తున్నారు’ అని గడికోట ప్రభుత్వ పాలన గురించి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment