
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య చేసిన విమర్శలకు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... రావుల, సండ్ర నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని గుర్తుచేశారు. త్వరలో ఏపీలో కూడా ఖాళీ అవుతుందన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందన్నారు. ఆ భయంతోనే వైఎస్సార్ సీపీ అధినేతపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.
ఐదు కోట్ల ఏపీ ప్రజలు, హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే హర్షించాల్సింది పోయి టీడీపీ నేతలు విమర్శలకు దిగడం దారుణమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి మీ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని గట్టు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటూ దొరికిపోయారని విమర్శించారు. జగన్ గురించి ఇక తెలంగాణ టీడీపీ వారు ఎక్కడైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.