
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం కోసం పలు చట్టాలను అమలు చేసిన ఏకైక సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, కార్మికు లకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, భద్రత విషయంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. సింగరేణిలోని కారుణ్య నియామకాల విషయంలో తీవ్ర జాప్యం జరగడం వల్ల కార్మికులు, కార్మికుల పిల్లలు నష్టపోతున్నారని అన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల భద్రతకు తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి సంక్షేమం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం కార్మికులకు అండగా ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
అమలుకాని కార్మిక చట్టాలు
పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని, అసంఘటిత కార్మికుల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, భద్రత, హక్కుల అమలు కోసం వారి పక్షాన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందని అన్నారు.
అనంతరం గట్టు, ఓబుల్ రెడ్డి వివిధ విభాగాల్లో పనిచేస్తూ విశిష్ట సేవలందిస్తున్న రాజారెడ్డి, శ్రావణ్ కుమార్, సి.చంద్రశేఖర్ రెడ్డి, నారాయణమ్మ, ధనలక్ష్మి, రాజేందర్‌లకు మేడే కార్మిక అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ప్రఫుల్లా రెడ్డి, మతీన్, బి.సంజీవరావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment