నన్ను గెలిపించండి.. ప్రత్యర్థులను నరుక్కోండి.. | Gonuguntla Suryanarayana Sensational Comments At Party Activists Meeting | Sakshi
Sakshi News home page

నన్ను గెలిపించండి.. ప్రత్యర్థులను నరుక్కోండి..చంపుకోండి.. 

Published Thu, Mar 14 2019 4:29 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Gonuguntla Suryanarayana Sensational Comments At Party Activists Meeting - Sakshi

ధర్మవరం: ‘‘నన్ను గెలిపించండి.. ఎలక్షన్లు అయినాక ఆర్నెల్లు సమయం మీకు ఇడిసిపెడతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి. చంపుతారా? కాళ్లు చేతులు ఇరుస్తారా.. పొడుస్తారా మీ ఇష్టం. అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఐదేళ్లు శాంతియుతంగా ఉండాలనుకున్నాం. శాంతియుతంగా ఉంటే కొందరు బడాయి పడతున్నారు. ఆ బడాయిగాళ్లందరినీ కాళ్లు చేతులూ ఇరచాల్సిందే.. తప్పదు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే పని మొదలుపెట్టండి. ప్రత్యర్థులను అంతమొందిస్తే తప్ప మనకు మనుగడ ఉండదు. మే 16 నుంచి నవంబర్‌ 16వ తేదీ వరకు టైం ఇస్తాం’’.. 

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీకి చెందిన ‘హార్డ్‌కోర్‌.. సాఫ్ట్‌కోర్‌’(ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల్లో బలంగా బెదిరించే వారిలో రౌడీషీటర్లను హార్డ్‌కోర్‌ సభ్యులుగాను, చిన్నచితకా పనులు చేసేవారిని సాఫ్ట్‌కోర్‌ సభ్యులుగానూ విభజించారు) కార్యకర్తలతో జరిపిన అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలివీ.. అంతేగాక ప్రత్యర్థులను చంపుతుంటే అడ్డురాకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే ఆదేశిస్తానని సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పారు.

నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్న టీడీపీ నేతలైన మాజీ ఎంపీపీ, వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మద్దిలేటి, కౌన్సిలర్‌ రాయపాటి రామకృష్ణ, గంటాపురం జగ్గు, బోయపాటి ప్రదీప్, నాగశేషయ్యలు ఎమ్మెల్యే ఆగడాలను భరించలేక బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు అనంతపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపులను మీడియాకు విడుదల చేశారు. హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించేలా స్వయానా ఎమ్మెల్యే మాట్లాడిన వైనాన్ని వారు బహిర్గతం చేశారు. ఈ ఆడియో టేపులు జిల్లాలో, నియోజకవర్గంలో పెను సంచలనమయ్యాయి.

ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేదు..
ధర్మవరం ఎమ్మెల్యే అఘాయిత్యాలను టీడీపీ నేతలు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. ఆయన అరాచకాలకు అంతులేదన్నారు. నియోజకవర్గంలో తన కోటరీని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. ధర్మవరంలో ప్రత్యేకంగా సూరీ జీఎస్టీ చెల్లిస్తేనే పనులు సాగుతాయన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్‌ నాయకులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు. ‘‘భూముల్ని దౌర్జన్యంగా రైతుల్నుంచీ లాగేసుకుంటున్నాడు. ఆయన అరాచకాలను ప్రశ్నించేవారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయింపచేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. టీడీపీలో ఉన్నా మాకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టుగానే ఉంది. మాపైనా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడు.

రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద టెండర్ల వరకు ఆయనకు కమీషన్లు ముట్టజెప్పందే పనులు దక్కవు. ఎవరైనా పనులు దక్కించుకుంటే తన అనుచరులతో వారిపై దాడులు చేయించి బలవంతపు వసూళ్లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు’’ అని వారు తెలిపారు. ఆయన అరాచకాలు, వేధింపుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరక్కపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సూరి ఓటమి లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఇంకా శంకర్, నరసింహులు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement