
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు.
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది.గవర్నర్ నిర్ణయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు మంగళవారం రాత్రి 8.30 గంటలతో ముగియనుండగా ఈలోగానే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం పట్ల విపక్షాలు భగ్గుమన్నాయి. కాగా, బలనిరూపణ గడువును మరో 48 గంటలు పొడిగించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గవర్నర్ కోరిన అనంతరం రాజ్‌భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫార్సు చేశారు.
ఇక కేంద్ర హోంశాఖకు గవర్నర్ లేఖ చేరడంతో కేంద్ర క్యాబినెట్ గవర్నర్ సిఫార్సును ఆమోదించింది. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు ఇచ్చిన గడువు పొడిగించేందుకు నిరాకరించిన గవర్నర్ ఎన్సీపీని మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు సంప్రదింపులు జరుపుతుండగానే గవర్నర్ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.