
సాక్షి, సిమ్లా : దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడం, జీఎస్టీని తీసుకరావడం గొప్ప విజయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాటుకుంటోంది. కానీ నవంబర్ 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ వ్యాపారస్థులు, ఆపిల్ తోటల రైతులు అందుకు విరుద్ధంగా వాపోతున్నారు. ముందుగా పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత జీఎస్టీ తీసుకరావడం మూలుగే నక్కమీద తాటి పండు పడ్డట్టు అయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణం, పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పటికే ఆపిల్ పండ్ల దిగుబడి తగ్గిపోగా, నగదు అందుబాటులో లేకపోవడం, జీఎస్టీ కారణంగా పంటలపై పెట్టుబడులు పెరిగిపోవడం, దిగుబడి తగ్గిపోవడం తమను తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు కారణంగా గత రెండేళ్లలో ఆపిల్ పండ్ల దిగుబడి దాదాపు 40 శాతం తగ్గిందని, దాదాపు మూడు కోట్ల కార్టన్ల నుంచి రెండు కోట్ల కార్టన్లకన్నా తగ్గిందని భారత ఆపిల్ పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు రవీందర్ చౌహాన్ తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సంఘం క్రియాశీలకంగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం నుంచి వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా పంట దిగుబడి తగ్గిపోగా, గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నగదు లేకపోవడం వల్ల ఆపిల్ పెంపకం దార్ల నుంచి తాము సరకును కొనుగోలు చేయలేకపోయామని, పర్యవసానంగా వారు ఈ సీజన్ పంటను వేయలేకపోయారని చౌహాన్ వివరించారు. ఆ తర్వాత జీఎస్టీని తీసుకరావడంతో ఎరువుల ధరలు, కార్టన్ల ధరలు కూడా పెరిగాయని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీటి ప్రభావం ఉంటుందా ? అని ప్రశ్నించగా తప్పకుండా ఉంటుందని రవీందర్ చౌహాన్ అన్నారు. రాష్ట్రంలోని 68 సీట్లకుగాను సిమ్లా, కుల్లూ, కిన్నార్, మండి, ఛాంబ, సిర్మార్, లహాల్–స్పితి జిల్లాల్లోని 33 సీట్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. మూడేళ్ల క్రితం ఆపిల్ వ్యాపారం దాదాపు ఐదువేల కోట్ల రూపాయలు ఉండగా, ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలకు పడిపోయిందని ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ఈ వ్యాపారానికి దూరమైన చిరువ్యాపారులు జీఎస్టీ రాకతో ఇటువైపు మళ్లీ రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ కారణంగా ఎరువుల ధరలు క్వింటాల్‌కు 50, 60 రూపాయలు పెరగ్గా, 40, 43 ఉన్న కార్టర్ల ధరలు 50, 52 రూపాయలకు పెరిగాయని ఆయన చెప్పారు.