విజయ్ రూపానీ (ఫైల్ ఫోటో)
గాంధీనగర్ : గుజరాత్‌లో స్థానికేతరులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. దాడులకు కారణం మీరంటే మీరేననీ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. దాడులు ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై రూపానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీనే అల్లర్లను ప్రోత్సహిస్తూ.. మరోవైపు ఖండిస్తూ ట్వీట్ చేయడానికి అతనికి అవమానకరంగా లేదా అని ఘాటుగా స్పందించారు. ‘‘దాడులను కాంగ్రెస్ పార్టీనే ప్రోత్సహిస్తోంది. వాటిని అరికట్టాలి అంటే ముందుగా వారి సొంత పార్టీ నేతలను, కార్యకర్తలను శిక్షించాలి. ఓవైపు అల్లర్లు చేస్తూ.. మరోవైపు ఏమీ తెలియనట్టు ఖండించడానికి అవమానకరంగా అనిపించడం లేదా’’ అంటూ విజయ్ రూపానీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
రూపానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. దాడులకు ముమ్మాటికీ కారణం బీజేపీ అంటూ ఆరోపిస్తోంది. ‘‘గుజరాత్‌కు వలస వచ్చిన వారిపై అధికార బీజేపీ కక్షగట్టి దాడలకు పాల్పడుతోంది. దీనికి ముఖ్య కారణం రాష్ట్రంలో నిరుద్యోగం మరింత పెరిగిపోవడం. ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారీపోవడం. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మూతపడడం వల్ల ఉపాధి కరువై వలసదారులును గెంటివేస్తున్నారు’’ అని సోమవారం రాహుల్ ట్వీట్ చేశారు.
గుజరాత్‌లో 14 నెలల చిన్నారిపై బిహార్ వలస కార్మికుడి లైంగిక దాడి నేపథ్యంలో చెలరేగుతున్న నిరసనలు, హింసాకాండ వలస కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. క్షత్రియ ఠాకూర్ సేన ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో గుజరాతేతరులపై ఎలాంటి దాడులకు పాల్పడటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ స్పష్టం చేశారు. వలస కార్మికులపై గుజరాత్‌లో మూక దాడులకు తాము ఎన్నడూ పిలుపివ్వలేదని, గుజరాత్‌లో శాంతి కోసం కృషిచేస్తున్నామని క్షత్రియ ఠాకూర్ సేనకు నేతృత్వం వహిస్తున్న అల్పేష్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. బిహార్, యూపీ వాసులపై దాడులను ఖండిస్తున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. దీనిపై గుజరాత్ సీఎంను తాను ఫోన్‌లో సంప్రదించానని అయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment