
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. (మంత్రి ఆదికి ఊహించని షాక్)
గుంటూరు జిల్లా గుజరాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. డాక్టర్ ఉన్నం నాగ మల్లిఖార్జున రావు, వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం తదితర నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. వీరందరినీ వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహేష్‌రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు దాదాపు 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి వచ్చాయి.
విశాఖలోనూ...
అరకు సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. డీసీసీ కార్యదర్శి కింజేటి అప్పారావు, టీడీపీ నాయకుడు పి. అప్పారావు, పోర్ట్ మాజీ సెక్రటరీ దామోదర్ తదితరులు వైఎస్సార్ సీపీలోకి వచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలోనూ..
ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు కడలి రాంపండు తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కర్నూలు జిల్లాలో..
పత్తికొండ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు శ్రీదేవి, పార్టీ నేతలు బివై రామయ్య, ప్రదీప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రామచంద్రతో పాటు 200 మంది కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment