సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీ భయం పట్టుకుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం బీజేపీ ఎంపీ హరిబాబుతో కలిసి ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు డ్రామా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. యూసీలు అడిగితే తామేమన్న గుమస్తాలమా అంటున్న టీడీపీ నేతలకు ప్రభుత్వ అధికారులంటే అంత చులకనగా కనబడుతున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నట్టేటా ముంచిందని ఎద్దేవా చేశారు. 600 హామీలు ఇచ్చిన టీడీపీ వాటిని అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు.
ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇస్తున్న చంద్రబాబు కేంద్రాన్ని నిందిస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు నిర్మాణానికి 8 నెలల సమయం ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం కట్టలేకపోయిందని.. అలాంటి వారు ప్రపంచంలోనే 4వ పెద్ద రాజధాని నిర్మిస్తామంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుని తిడుతున్నారో, పొగుడుతున్నారో ఆ పార్టీ నేతలనే అడగాలన్నారు.
హరిబాబు మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 2018-19 ఏడాదికి గానూ 6243 కోట్ల రూపాయల నరేగా నిధులు విడుదలయ్యాయని తెలిపారు. గతేడాది కంటే ఈ సారి వెయ్యి కోట్లు అదనంగా నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న సహాయాన్ని టీడీపీ చిన్నదిగా చూపే ప్రయత్నం చేయడం మంచింది కాదన్నారు. కాంగ్రెస్‌ది నక్క తోక కాదని.. అది కుక్క తోక మాత్రమేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment