
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటమి భయంతో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే శక్తిలేదని అందుకే ఏమీ చేయలేని పరిస్థితిలో కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని ఆయన శుక్రవారమిక్కడ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా ఉండికూడా 29సార్లు ఢిల్లీ వెళ్లి ఒక్క పని కూడా చేయించుకోలేని అసమర్థ వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ వైదొలగడం తమకొక మంచి అవకాశం అని, తమ వ్యూహాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
ఇన్ని రోజులు కేంద్రంలో ఉండికూడా రాష్ట్రానికి ఏం చేయలేని చేతకాని ముఖ్యమంత్రి చంద్రబాబు అని, త్వరలోని ఆయన కుట్రలు, మోసాలు, అవినీతి బయట పెడతామని జీవీఎల్ హెచ్చరించారు. ఏపీలో టీడీపీని ఎదుర్కునే శక్తి బీజేపీకి ఉందని, రాష్ట్రంలో గెలవలేనివారు ఢిల్లీలో ఏం చేయగలరని ఆయన సూటిగా ప్రశ్నించారు. తమ చేతగాని తనాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, నాలుగేళ్లల్లో రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చారని దుయ్యబట్టారు.