సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకోవాలని.. హిందువులు, దేశ ప్రజలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచంలో హిందువులందరూ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన టీటీడీ బోర్డులో తాను క్రిస్టియన్ అని చెప్పుకున్న అనితను సభ్యురాలిగా నియమించడం హిందువులను అవమానించడం కాదా? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఇది వేరే మతాల వాళ్ల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుశ్చర్యగా చెప్పకతప్పదు.
ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనిత స్వయంగా ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన ప్రభుత్వం హిందువులు, దేశ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పుకుని, దేవుడి సాక్షిగా చెంపదెబ్బలు వేసుకుని ఈ తప్పిదం మళ్లీ చేయనని ప్రజలకు చెప్పాలి..’ అని నరసింహారావు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘ఇది ధర్మపోరాటం అని చెప్పి కోట్లలో డబ్బులు ఖర్చు చేయడం తప్ప వారు చేసిందేమీ లేదు. మానసిక ఒత్తిళ్లకు.. రకరకాల భయాందోళనలకు సీఎం గురయ్యారు. నిన్న జరిగిన తంతు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా దూషించడానికి వాడుకున్నారు తప్పితే ఒక మర్యాద కలిగిన పార్టీ, ఒక హోదా ఉన్న వ్యక్తులు చేసే వ్యవహారంలా లేదు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కుటుంబ ప్రతిష్టను, ఎన్టీయార్ పేరును, తెలుగు ప్రజల గౌరవాన్ని పూర్తిగా మంటగలిపారు. ఆయన క్షమాపణ చెప్పాలి’ అని నరసింహారావు డిమాండ్ చేశారు.
చంద్రబాబు..అనితను తప్పించండి..
Published Sat, Apr 21 2018 7:51 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment