
వనపర్తి టౌన్: పాలనలో లోపాలను ఎత్తి చూపడం దేశం, రాష్ట్రంలో నేరంగా మారిందని పౌరహక్కుల నేత జి.హరగోపాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం పాలకుల దృష్టిలో నేరంగా మారిందని ఆక్షేపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం దోపిడీదారులకు అనుకూలంగా పాలన సాగుతోందని, రైతులు అప్పులు తీర్చలేక పోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రాణాలు విడిచిన 3 లక్షల మంది రైతులు ప్రభుత్వంపై తిరగబడి ఉంటే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 19న హైదరాబాద్‌లో నీటి వాటాపై సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ నగరి బాబయ్య మాట్లాడుతూ.. గౌరీ లంకేష్ ప్రశ్నించేతత్వం, వాస్తవాలు రాసినందుకే రాజ్యం హత్య చేసిందని ఆరోపించారు.