అవి డొంకతిరుగుడు సమాధానాలు | Harish rao fires on uttam kumar reddy | Sakshi
Sakshi News home page

అవి డొంకతిరుగుడు సమాధానాలు

Published Fri, Oct 12 2018 1:02 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Harish rao fires on uttam kumar reddy - Sakshi

జోగిపేట(అందోల్‌)/నారాయణఖేడ్‌: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదనే తెలంగాణ ద్రోహుల పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేసుకున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్, కంగ్టి, నారాయణఖేడ్‌లలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను 12 అంశాలతో కూడిన ప్రశ్నలను సంధిస్తే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ‘కృష్ణా, గోదావరి జలాలు రాష్ట్రానికి దక్కకుండా అడ్డుకుంటున్నది చంద్రబాబు కాదా? తెలంగాణ పరిధిలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుకొ న్నది నిజం కాదా?’అని ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటు విషయంలో ఒక్క అడుగు ముందుకు పడకుండా కాంగ్రెస్‌ హయాంలోని సీఎంలు అడ్డుకట్ట వేస్తుంటే పదవుల కోసం మీరంతా పెదవులు మూసుకోలేదా అని హరీశ్‌ నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాకు రూ.9 వేల కోట్లు తాగునీటి పథకం పేరుతో తన్నుకుపోతుంటే తాను అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడు.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని బల్ల గుద్దీ మరీ చెబుతుంటే ఆరోజు మీరంతా ఎందుకు నోరుమెదపలేదని దుయ్యబట్టారు. ఆంధ్ర నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు బానిసలుగా మారారని విమర్శించారు.

మిర్యాలగూడలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కడుతుంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యతిరేకించడంపై ఉత్తమ్‌ స్పందించాల్సిన అవసరం ఉందన్నా రు.  తమ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల పేరుతో పేదింటి పిల్లల పెళ్లిళ్లకు రూ.లక్షకు పైగా ఇస్తోందని, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎప్పుడైనా కనీసం పదిరూపాయలైనా ఇచ్చాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ కేంద్రానికి చంద్రబాబు ఒకవైపు లేఖలు రాస్తుంటే ఆయనతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ పాకులాడుతోందని హరీశ్‌ మండిపడ్డారు.

కాంగ్రెస్‌ నేతలను నిలదీయండి
రైతు బంధు, బతుకమ్మ చీరల పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులను గ్రామాల్లోకి వస్తే ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ పథకాలు అమలైతే తాము ఆగమైతామని భావించి ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని విమర్శించారు. అయితే ఎన్నికల కమిషన్‌ చెక్కులు కాకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని సూచించిందని, అలా రైతులకు ఈ సారి కూడా పెట్టుబడి డబ్బులు వస్తాయని అన్నారు.

కాగా, బతుకమ్మ చీరలు ఎక్కడికీపోవని, వచ్చేది మన ప్రభుత్వమేనని.. బతుకమ్మ పండుగకు కాకుంటే సంక్రాంతికి మన చీరలు మనకు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, అందోలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతికిరణ్, నారాయణఖేడ్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement