
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు నాటకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నడ రెబల్‌స్టార్, మాజీ మంత్రి అంబరీష్ తాజాగా శనివారం రాత్రి జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో భేటీ అయ్యారు. కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించినప్పటికీ అంబరీష్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు అంబరీష్ ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయనని స్పష్టం చేశారు. రాజకీయాలకు రాం రాం.. అన్నారు. అయితే హెచ్‌డీ కుమారస్వామి నివాసానికి వెళ్లి కలవడం వెనుక ఆంతర్యమేంటని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్‌పై అలకవీడని అంబి
కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మండ్య టికెట్ ఇచ్చి ప్రోత్సహించినా ఆసక్తి చూపలేదు. అంబరీష్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రిగా పని చేశారు. అయితే 2016లో ఉన్నఫలంగా కేబినెట్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో మండ్య నుంచి పోటీ చేయాలని బీఫారం ఇచ్చినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే నామినేషన్లకు గడువు సమీపించడంతో ఏదో నిర్ణయం చెప్పాలని కాంగ్రెస్ పెద్దలు కోరగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్‌బై అన్నారు. అయితే కుమారస్వామి భేటీతో అంబరీష్ జేడీఎస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంబి కూడా జేడీఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment