సాక్షి, విశాఖపట్నం : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీనిలో భాగంగా బాక్సింగ్ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. విజయాలు సాధించినపుడు ప్రభుత్వం సన్మానాలు చేస్తోందని.. అంతకంటే ముందు ఎలాంటి ప్రోత్సాహం అందించటం లేదని మండిపడ్డారు. తనకు స్పాన్సర్ షిప్ కావాలని జననేతను ఆమె కోరారు. మౌనిక జాతీయ స్థాయిలో పది ఈవెంట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఒక ఈవెంట్‌లో పాల్గొన్నారు.
వైఎస్ జగన్ ఎస్ ఆర్ పురం క్రాస్ మీదుగా డబ్బండ క్రాస్‌కు చేరుకున్నారు. దీంతో తిరిగి భీమిలి నియోజకవర్గంలోకి ఆయన అడుగుపెట్టారు. అక్కడ జననేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు, విద్యార్థులు, రైతులు నీరాజనం పలికారు. రహదారిపై పూలు చల్లి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సత్తరువు జంక్షన్ వద్ద జననేతను స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఇనుప ఖనిజం కొరత వల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్ధ్యం పెంచలేకపోతున్నామని, అందువల్ల ఏపీతో పాటు, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని గనులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ మార్కెటింగ్, ఫైనాన్స్ కార్యాలయాల కోసం రాజధాని అమరావతి (సీఆర్‌డిఏ పరిధి)లో ఒక ఎకరం కేటాయించడంతో పాటు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల కోసం 10 ఎకరాల చొప్పున కేటాయించేలా చూడాలని వైఎస్ జగన్‌ను కోరారు.
స్టీల్ ప్లాంట్ అధికారులకు వేతన సవరణ జరిగేలా, ఎఫర్డబిలిటీ క్లాజ్‌ను తొలిగించేలా చూడాలన్నారు. ఇంకా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని జననేతను కోరారు. పాదయాత్రలో ప్రతి చోటా జననేతకు ప్రజలు ఘన నీరాజనం పలికారు. పలు చోట్ల విద్యార్థులు, రైతులు, దివ్యాంగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. మరోవైపు జననేతతో సెల్ఫీలు దిగటం కోసం విద్యార్థులు, మహిళలు పోటీ పడ్డారు. ఎవ్వరినీ నిరాశపర్చని వైఎస్ జగన్ ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడారు. ఏ మాత్రం విసుగు చెందకుండా స్వయంగా ఫోటోలు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment