ఒక్క అడుగు.. బడుగుల కష్టాలు తెలుసుకునేందుకు.. వారి కన్నీళ్లు తుడిచేందుకు.. నేనున్నానని భరోసా ఇచ్చేందుకు జనక్షేత్రంలో మోపిన ఆ అడుగు.. వందలు, వేలు, లక్షల అడుగులు వేసింది..
రోజు.. పది రోజులు.. నెల.. ఇలా నిరంతరాయంగా సాగుతున్న ఆ యాత్రకు నేటితో సరిగ్గా ఏడాది..
365 రోజులు.. 3200 కిలోమీటర్లు.. ఎన్నో మైలురాళ్లు.. ఓ కొత్త చరిత్ర సృష్టిస్తూ.. జనపదాలను స్పృశిస్తూ.. జనం గుండెల్లోని బాధను దించేస్తూ.. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ సాగుతున్న ఆ సుదీర్ఘయాత్ర ప్రత్యర్థుల గుండెల్లో గునపాలు దించించి.. జననేతకు లభిస్తున్న అపూర్వ ఆదరణ చూసి వారి కన్ను కుట్టింది. కుతంత్రం కన్ను తెరిచింది.. వారిలోని కుత్సితం
బయటకొచ్చింది.
రాష్ట్రంలో 11వ జిల్లా విశాఖలో అపూర్వరీతిలో జనాదరణ అందుకొని.. 12వ జిల్లా అయిన విజయనగరంలో అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్రకు బ్రేక్ వేయాలనో.. అసలు జననేతనే అంతం చేయాలన్న భయంకరమైన కుట్రతోనో ప్రణాళిక రచించారు.
సాక్షి, విశాఖపట్నం :విశాఖ ఎయిర్‌పోర్టు మీదుగా ప్రతివారం రాకపోకలు సాగిస్తున్న ప్రజానేత వై.ఎస్.జగన్‌పై ఎయిర్‌పోర్టులోనే హత్యాయత్నానికి తెగబడ్డారు.అయితే భగవంతుని ఆశీసులు మెండుగా ఉన్న.. జనాదరణే రక్షణ కవచంగా మలచుకున్న జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర గాయంతో బయటపడ్డారు.తమ కష్టాలు కన్నీళ్లు తుడిచేందుకు ఎండావానల్లోనూ.. అనారోగ్యాన్నీ లెక్కచేయకుండా తిరుగుతున్న అభిమాన నేతపై జరిగిన ఈ హత్యాయత్నం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. కన్నీరు పెట్టించింది.. పాదయాత్ర కొనసాగి ఉంటే ఏడాది పండుగ అంబరాన్ని తాకేదని.. ప్రత్యుర్థుల కుట్రల కారణంగా.. యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడినా.. త్వరలోనే ఆ అడుగులు.. ఆ భరోసా.. ఆ ధైర్యం.. తమ ముందుకు రావాలని.. అందుకు దేవుడు జగన్‌మోహన్‌రెడ్డికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని.. ఆయన త్వరగా కోలుకొని రెట్టింపు సంకల్ప బలంతో తమ మధ్యకు మళ్లీ రావాలని ప్రజలు కాంక్షిస్తున్నారు.
నవంబర్ 6.. 2017..
ఓ చారిత్రక ఘట్టానికి నాంది పలికిన రోజు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడి వారసునిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి అదే శైలినీ, ఒరవడినీ అనుసరించడమే కాదు అంతకు మించి ప్రజలకు సంక్షేమాన్ని అందజేయాలన్న తపనతో ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన రోజు.. తండ్రి స్ఫూర్తితో, తల్లి ఆశీస్సులతో ఇడుపులపాయ వద్ద ప్రారంభమైన యాత్ర ఎండావానలను సైతం లెక్కచేయక, అనారోగ్యాన్ని ఖాతరు చేయక అప్రతిహతంగా సాగిపోయింది. ఒకటా.. రెండా.. పదులా.. వందలా 3,200 కిలోమీటర్ల మైలురాయినీ దాటేసింది. అదే సమయంలో సంకల్పయాత్రకు హాజరవుతున్న జన ప్రభంజనాన్ని చూసి అధికారపక్షానికి వెన్నులో వణుకు పుట్టింది. ప్రజలతో మమేకమవుతూ వారి కష్టనష్టాలను, సాధకబాధకాలను ఓపిగ్గా వింటూ.. భరోసా ఇస్తూ సాగిపోతున్న జన నాయకుని చూసి కలవరం మొదలైంది. ఈ తరుణంలో.. ఓర్వలేని ఏ కన్నుకుట్టిందో.. హత్యకు కుట్ర పన్నింది. పటిష్టమైన భద్రతావలయంలో ఉన్న విశాఖ విమానాశ్రయంలోనే జనసంక్షేమ సారథిపై హత్యాయత్నం జరిగింది. తాము ఎంతో ఆరాధించే నాయకునికి తమ జిల్లాలోనే ఇంతటి కష్టం రావడంపై విశాఖ తల్లడిల్లింది. తమ కన్నీటిని తుడిచే ఆప్తుడు.. కష్టాలు తీర్చే జనబాంధవుడు తిరిగి ప్రజల్లోకి రావాలని దేవుని ప్రార్థిస్తోంది. అనితర సాధ్యమైన మీ సంకల్పం అపూర్వమని కీర్తిస్తూ.. మీ అడుగులు మళ్లీ వడివడిగా సాగాలన్నది ప్రజావాహిని ఆకాంక్ష.
విశాఖలో 277.1 కిలోమీటర్ల పాదయాత్ర
రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్రలో అడుగుపెట్టింది మొదలు అన్నీ సంచలనాలే చోటు చేసుకుంటున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాలను దాటుకుని విశాఖలో అడుగిడిన బహుదూరపు బాటసారికి విశాఖ జిల్లాలో జన నీరాజనాలుపలికారు. గన్నవరం మెట్ట వద్ద ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన జననేత పాదయాత్ర 32రోజుల పాటు 277.1 కిలోమీటర్ల మేర సాగింది. 12 నియోజకవర్గాల్లోని 20మండలాలు, జీవీఎంసీతో సహా నర్సీపట్నం, యలమంచలి, అనకాపల్లి పట్టణాల్లో యాత్ర సాగింది. నభూతో న భవిష్యతి అన్నట్లుసాగిన కంచరపాలెం సభతో సహా జిల్లాలో తొమ్మిది చోట్ల బహిరంగ సభలు, రెండుచోట్ల ఆత్మీయ సదస్సులు జరిగాయి.
తడిసి ముద్దయినా ఆగని అడుగు
నర్సీపట్నం, యలమంచిలి, అడవివరం, ఆనందపురం తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షంలో తడిసి ముద్దయినా లెక్కచేయకుండా పాదయాత్ర కొనసాగించారు జగన్. జిల్లా పర్యటనలో పలుమార్లు జలుబు, జ్వరంతో ఇబ్బందిపడ్డారు. పాదయాత్ర సాగినంత సేపు డస్ట్ ఎలర్జీతో సతమతమయ్యారు. కానీ ఎక్కడా యాత్రను ఆపలేదు. ప్రజలతో మమేకమయ్యేందుకు వజ్ర సంకల్పంతో ముందుకు సాగారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి కష్టాలు వింటూ కన్నీళ్లు తుడిచారు. వివిధ వర్గాల ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి భరోసా ఇచ్చారు. విశాఖలోనే ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. 2737.1 కిలోమీటర్ల వద్ద విశాఖ జిల్లాలో అడుగుపెట్టిన జననేత 2,800కిలోమీటర్ల మైలురాయిని యలమంచిలి పట్టణం కోర్టు సెంటర్‌లోనూ, 2,900 కిలోమీటర్ల మైలురాయిని సబ్బవరం కొత్తరోడ్డు వద్ద దాటారు. 3 వేల కిలోమీటర్లను విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎస్.కోట మండలం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద
అధిగమించారు.
హత్యాయత్నంపై తల్లడిల్లుతున్న విశాఖ
పాదయాత్రలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన విశాఖలోనే ఆయనపై హత్యాయత్నం జరగడాన్ని విశాఖవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత భద్రత కలిగిన ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఈ దుశ్చర్యకు పాల్పడడంతో నివ్వెరపోయారు. తనపై హత్యాయత్నం జరిగినా.. కార్యకర్తల్లో ఆగ్రహం వెల్లువెత్తకుండా.. ఉద్రిక్తతను నివారించే యోచనతో అంతటి బాధను పంటి కింద అదిమిపట్టి మరీ హైదరాబాద్ వెళ్లిపోవడాన్ని చూసి ఆయన స్థైర్యాన్ని అభినందిస్తున్నారు. ఏనాడూ అనారోగ్యమన్నది ఎరుగని జననేత హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి పడుతున్న బాధను చూసి తల్లడిల్లిపోతున్నారు. త్వరగా కోలుకొని రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ యాత్రను ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
ఆ బాబుకి ప్రజల ఆశీస్సులుఉంటాయయ్యా..
జగన్ బాబు ప్రజల సమస్యలు, బాగోగులు తెలుసుకునేందుకు తన కుటుంబాన్నే వదిలేశాడయ్యా. ఏడాదిగా రాష్ట్రం అంతా తిరుగుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాడు. మాలాంటి వారి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అది చూడలేకే .. ప్రజల్లో లేకుండా చేద్దామనే చంపుదామని చూశారు. ఆ బాబుకు ఏమీ జరగదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయయ్యా. ఆ బాబుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.– చుక్కల ధర్మయ్య, చేనేత కార్మికుడు,పైడిపాల, మాకవరపాలెం మండలం
నా బిడ్డకు గాయమైనంతబాధగా ఉంది
జగన్ భుజానికి దెబ్బ తగిలిందంటే నా బిడ్డకు గాయమైనట్లుగా అనిపిస్తుంది. త్వరగా కోలుకోవాలని క్రమం తప్పకుండా మసీదుకు వెళ్లి నమాజు చేస్తున్నాను. జగన్‌పై హత్యాయత్నం నీచ రాజకీయాలకు ఉదాహరణ. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఇలా చేశారు. భుజానికి తీవ్ర గాయమైనా పాదయాత్రకు సిద్ధమవ్వడం జగన్ వంటి నాయకుడికి మాత్రమే సాధ్యం. నా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తొందర్లోనే రావాలి.– షేక్ అబ్దుల్, కోటవీధి
కత్తితో పొడిచారని తెలిసినివ్వెరపోయాం
జగన్ ప్రజలతో కలసిపోయి తిరుగుతుంటే ఆయన తండ్రిలానే మా బాగోగులు చూస్తారనుకున్నాం. ఆయనను కత్తితో పొడిచారని తెలిసి నివ్వెరపోయాం. త్వరగా కోలుకోవాలి.
– పీల కృష్ణవేణి, గృహిణి, నాలుగో సెక్టార్, ఆరిలోవ
Comments
Please login to add a commentAdd a comment