
సాక్షి, న్యూఢిల్లీ : తాము అసలు దాడి చేయలేదని, కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై జరిగిన దాడి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతుండగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు కొంపముంచారు. దాడిని తాను స్వయంగా చూశానని కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్ పోలీసులకు చెప్పారు. ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యేలు అమనుతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్ దాడి చేయడం తాను చూశానని, తానే అందుకు సాక్షినంటూ వెల్లడించారు.
ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు గురువారం వివరించారు. సీఎస్ ప్రకాశ్‌పై దాడి చేసిన నేపథ్యంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించేందుకు రిమాండ్‌లోనే ఉంచాలంటూ మేజిస్ట్రేట్‌ను కోరారు. ఆ ఇద్దరికి ఇప్పుడే బెయిల్ ఇవ్వొద్దని, తాము మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఇరువురి వాదనలు విన్న మేజిస్ట్రేట్ తుది నిర్ణయాన్ని వెలువరించలేదు. దీనిపై నేడు (శుక్రవారం) తేలాల్సి ఉంది. మరోపక్క, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించని విషయం తెలిసిందే.