
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏప్రిల్ 6న ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. హోదా విషయంలో రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం మంత్రి నక్కల హరిబాబు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు తగదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.
టీడీపీ ఎంపీలూ కలిసిరావాలి: వరప్రసాద్
చిత్తూరు: ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతోంది వైఎస్‌ఆర్‌సీపీనే అని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు కూడా తమతోపాటు రాజీనామా చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.