సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన సీఎం పీఠం తమకే దక్కాలన్న డిమాండ్‌కు ఏ మాత్రం వెనుకాడట్లేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. సీఎం పదవిని చెరే రేండేళ్లు పంచుకోవాలని డిమాండ్ చేస్తూనే.. పదవుల్లో 50శాతం తమకు దక్కాలని కోరుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కమళ దళం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
అయితే బీజేపీ చీఫ్ అమిత్ బుధవారం ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్‌కు ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుండగా.. ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన తమను సంప్రదిస్తే వారి ఆహ్వానాన్ని పరిశీలిస్తామని మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పృధ్వీరాజ్ చౌహాన్ ప్రకటించారు. శివసేనతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, వారి ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తానే మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... ‘శివసేన ఐదేళ్ల పాటు సీఎం పదవి తమకే దక్కాలని ఆశిస్తుంది. కోరుకున్నవన్నీ జరగవు. ముఖ్యమంత్రి పీఠంపై మేమెప్పుడూ 50:50 ఫార్ములా పాటిస్తామని వారికి హామీ ఇవ్వలేదు. ఇది కాకుండా వాళ్లు వేరే డిమాండ్లతో రావాలి. అప్పుడు చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ఇక బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనేది సుస్పష్టం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే శివసేన-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ శివసేన ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు సమాచారం. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ ఇదివరకే వ్యాఖ్యానించారు. దీంతో మహా రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment