సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ పేర్కొనగా.. మరోవైపు ఇండియాటుడే తాజా సర్వే మాత్రం టీఆర్‌ఎస్ పార్టే పై చేయి సాధిస్తుందని స్పష్టం చేసింది. మరో రెండు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ఈ సర్వేలు సర్వత్రా ఆసక్తిరేపుతున్నాయి. లగడపాటి సర్వేకు భిన్నంగా ఇండియా టుడే తాజా సర్వేలో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యత లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇండియా టుడే పొలిటికల్ ఎక్స్‌ఛేంజ్.. 17 పార్లమెంట్ నియోజవర్గాల్లో టెలిఫొనిక్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌కు గత నెలకన్నా 4 శాతం మద్దతు పెరిగినట్లు వెల్లడైందని ప్రకటించింది. గత నెలలో 44 శాతం మంది టీఆర్‌ఎస్‌కు మద్దతు నిలవగా.. ప్రస్తుతం 48 శాతం మద్దుతు పలుకుతున్నట్లు తమ సర్వేలో స్పష్టమైందని పేర్కొంది. ఇక ప్రభుత్వం మారాలనే వారి సంఖ్య కూడా 4 శాతం పెరిగందని, గత నెలలో 34 శాతం మంది ప్రభుత్వ మార్పును కోరగా.. ప్రస్తుతం ఆ మద్దతు 38 శాతం పెరిగిందన్నారు. ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉండగా.. దక్షిణ తెలంగాణలో కూటమికి అనుకూలంగా ఉందని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీలపై ప్రజల్లో ఆధారణ ఉందని, ఇది టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొంది. నగరంలో ఎంఐఎం మద్దతు కూడా కలిసిసొస్తుందని, మురికి వాడల్లో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని తమ సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో టెలిఫొనిక్ ఇంటర్వ్యూ ద్వారా 6,887 శాంపుల్స్ తీసుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment