
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై హత్యాకాండలు, దాడులకు తగిన బదులు చెబుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి ఈ హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు అమానుషమన్నారు. శ్రీనివాస్‌ది రాజకీయ కక్షలతో కూడిన హత్యగానే భావిస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ గతంలోనే శ్రీనివాస్ పోలీసు ఉన్నతాధికారులను కోరినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు.
ఈ హత్యపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య దిగ్భ్రాంతికరమని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై దాడులు జరగడం అలవాటుగా మారిందన్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా టీఆర్‌ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దోషులపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment