
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోందని నడ్డా ఎద్దేవా చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకార్లలో పోరాడి గెలిచిన గడ్డపైకి రావడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజాంపై తెలంగాణ ప్రజలు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా కేవలం బీజేపీకే ఉందని చెప్పారు. కాంగ్రెస్ స్వప్రయోజనాలే ముఖ్యమని.. దేశ ప్రయోజనాలు అవసరం లేదని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని దేశ ప్రజలు కోరుకున్నారని.. అందుకే తమ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని చెప్పారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆర్టికల్ 370ని ఇంతకాలం కొనసాగించారని ఆరోపించారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండకూడదన్నారు. అందుకే ఒక దేశం-ఒకే రాజ్యాంగం విధానాన్ని మోదీ అమలు చేసి చూపించారని కొనియాడారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకంతో 55 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే ఆయుష్మాన్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసేది ఒకటి.. చెప్పేది మరోకటని విమర్శించారు. బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్‌ఎస్ కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. పలువురు టీఆర్‌ఎస్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment