
మిర్యాలగూడ: దేశంలో యూపీఏ, ఎన్‌డీఏ కూటములు తప్ప ఏ ఫ్రంట్ ఏర్పాటు చేసినా నిలవదని సీఎల్పీనేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా యూపీఏ లేదా ఎన్‌డీఏ కూటమిలో ఉండాల్సిందేనని, ఇది కాదని కొత్తగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తే కాలక్రమంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రజలే చూస్తారని వ్యాఖ్యానించారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని తెలిపారు. గెలవటానికి సరిపడా ఓట్లు లేవని తెలిసినా పోటీలో తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో ఉందని, రాజ్యసభ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేస్తే సుప్రీంకోర్టులో ఆధారాలతో కేసు వేయవచ్చునని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రబీ సీజన్‌లో ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగునీరివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడనున్నట్లు తెలిపారు.