
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అద్వానీలాంటివాడినని, ముఖ్యమంత్రి పదవిని అడగబోనని చెప్పారు. కానీ, అందరూ కోరితే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం అంటూ తన మనస్సులోని మాటను చెప్పకనే చెప్పేశారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీని ఎవరు గెలిపిస్తే.. వారే బాహబలి అని అన్నారు. పార్టీలో చేరగానే బాహుబలి కారంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ బాహుబలి ఉన్నాడని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఆయన గట్టెక్కిస్తాడని హస్తం శ్రేణుల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా జానారెడ్డి విమర్శలు చేశారు. అసెంబ్లీలో సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, వాయిదా తీర్మానాలను తిరస్కరించాలని బీఏసీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. 'ప్రభుత్వం సభలో మా గొంతు నొక్కుతోంది. మీడియా కూడా ఆవేదనను ప్రజలకు తెలుపడం లేదు. ఇక మేం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాడుతాం' అని జానారెడ్డి అన్నారు.