ఆదివారం కరీంనగర్‌లో విలేకర్లతో మాట్లాడుతున్న జానారెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘ముఖ్యమంత్రి అయ్యే అర్హత నాకుంది.. అలాగే అనేకమందికీ ఉంది.. అలాగనీ ఎన్నికలు జరగకుండా.. అధిష్టానం నిర్ణయించకుండా.. ఎవరికివారు అనుకోవడం సరికాదు.. ఏదైనా సీఎం విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం’’అని సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి అన్నారు. సీఎం కావడానికి అర్హత ఒక్కటే ప్రామాణికం కాదని, చాలా సమీకరణాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలూ లేవు. సీఎల్‌పీ, టీపీసీసీ కలిసి చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారు. కాంగ్రెస్‌కు అధికారమే లక్ష్యంగా అందరం పనిచేస్తున్నాం. కొందరు కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు అసందర్భంగా అసత్య ప్రచారం చేస్తున్నారు’’అని అన్నారు.
‘‘మీలాగే హైదరాబాద్‌లో చిట్‌చాట్ పెట్టినప్పుడు ‘టీమ్ లీడర్ గట్టిగా ఉండాలి’అని కొంతమంది మిత్రులంటే మా టీమ్‌లీడర్ బాగానే ఉన్నాడు కదా అన్నాను. గెలవడానికి టీమ్‌లీడరే కీలకం కాదు.. టీమ్‌లీడర్ గట్టిగా ఉన్నా.. మిగతా సభ్యులు ఆడకపోతే ఫెయిల్ అయితం. ఒకవేళ టీమ్‌లీడర్ గాయపడి సభ్యులు బాగా ఆడితే గెలుస్తుంటం. ఆ పేరు కెప్టెన్‌కే వస్తుంది. అన్నింటికీ సమన్వయం ముఖ్యం’’అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎలాంటి అవగాహన లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని, దానికి ఇంకా సమయం ఉందని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ప్రజలు భావించారని కానీ నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. మభ్యపెట్టేందుకు రోజుకో హామీ ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment