భ్రష్టు తెలంగాణగా మారుస్తున్నారు
టీఆర్‌ఎస్‌పై జానారెడ్డి, ఉత్తమ్ ధ్వజం
మిర్యాలగూడ: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు భ్రష్టు తెలంగాణగా మారుస్తున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 లేదా 7న కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే రబీలో రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన మహిళలకు రూ.25 వేలు చెల్లించాలని, ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలని, ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు రాయితీలు సమకూర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు.
ఇందులో భాగంగా 9వ తేదీన మహిళలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వాలు మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని ప్రపంచ ఆర్థిక వేత్తలు తప్పుడు నిర్ణయంగా పేర్కొన్నారని తెలిపారు. నోట్ల రద్దుతో దేశంలోని చిన్న సన్నకారు రైతులు, వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు, చిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 30 మాసాలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. 11వ తేదీన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నోట్లను రద్దు చేసి 51 రోజులుగా గడిచినా సాధించినదేమీ లేదని, పేదలను మాత్రం బ్యాంకుల వద్ద క్యూలో నిలబెట్టారని ధ్వజమెత్తారు.
గిరిజనుడిగా పుట్టాలని ఉంది: జానా
ఆయా పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా మిర్యాలగూడలో భారీ సభ నిర్వహించారు. సభకు సమీప ప్రాంతాలకు చెందిన గిరిజనులు భారీ సంఖ్యలో వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో జానారెడ్డి.. సభకు వచ్చిన గిరిజనులను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. తలపాగా ధరించి.. మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుట్టాలని ఉందని అనడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.