
బీసీ సదస్సులో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా క్రిష్ణమూర్తి
కడప కార్పొరేషన్: 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంలో బీసీలు భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జంగా క్రిష్ణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం కడపలోని పార్టీ కార్యాలయంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా క్రిష్ణమూర్తి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల(బీసీలు)కు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలు మోసపోయారన్నారు. వైఎస్‌ఆర్ సుపరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడు కులాల వారీగా సమస్యలను అధ్యయనం చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబు పోకడను ఎండగట్టాలన్నారు. మండల, వార్డు కమిటీలు కనీసం ముగ్గురు బీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి కులానికి ప్రాధాన్యం ఇచ్చి నాయకత్వాన్ని పెంపొందించాలన్నారు. బీసీల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని నవంబర్ 6 నుంచి వైఎస్ జగ¯Œన్‌మోహన్‌రెడ్డి చేపట్టబోయే పాదయాత్రలో వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బీసీలకు ఏం చేశారని టీడీపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, దానిని తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య, నగర అధ్యక్షుడు చినబాబు మాట్లాడుతూ బీసీలు విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి సమస్యలు తీర్చగల సమర్థ నాయకుడు జగనేనని తెలిపారు.అనంతరం బీసీ నాయకుల సలహాలు, సూచనలను స్వీకరించారు.
2019లో అధికారంలోకి వస్తున్నాం
2019లో అధికారంలోకి వస్తున్నామని వైఎ స్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఇస్త్రీపెట్టెలు, షేవింగ్ కిట్లు, వృత్తి పరమైన సామగ్రి ఇచ్చి బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చూసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బలిజలను బీసీల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ ఆశయ సాధనకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని, కులాల మధ్య ఉన్న ఆసమానతలను తొలగించడమే ఆయన లక్ష్యమన్నారు.
ఒక్కసారి అవకాశం కల్పించండి
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఒక్క అవకాశం కల్పించాలని కడప శాసనసభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా కోరారు. 35 ఏళ్లుగా బీసీలు టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నారని, అయితే ఆ పార్టీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీల అభ్యున్నతి కోసం వైఎస్‌ఆర్ విశేషంగా కృషి చేశారన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారని, ఆరోగ్యశ్రీ, పక్కాఇళ్లు, పింఛన్లు వంటి పథకాలతో ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అ«ధికారంలోకి వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. అంతకుముందు వారు మహాత్మా జ్యోతిరావు పూలే, వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కె. సురేష్‌బాబు, బీసీ నాయకులు శివయ్య యాదవ్, గోపాలస్వామి, విజయ్‌భాస్కర్, సురేష్‌కుమార్, బోలా పద్మావతి, టీపీ వెంకటసుబ్బమ్మ, పస్తం అంజి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment