
సాక్షి, వైఎస్సార్ : ‘బీసీలను ఎన్నికలలో అన్ని విధాల వాడుకుని మోసం చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే. బీసీలకు అన్ని విధాల న్యాయం జరగబోయేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. అందుకే ప్రజా సంకల్ప యాత్ర అనంతరం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నా’మని వైఎస్సార్‌సీపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణ మూర్తి ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన వారిని నట్టేట ముంచే నైజం చంద్రబాబుది. ఎన్నికల సమయంలో బీసీలను వాడుకున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి బీసీలు ఆయనను గెలిపించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక బీసీల గురించి పట్టించుకోకుండా వారిని నట్టేట ముంచారని విమర్శించారు. కానీ వైఎస్సార్ కుటుంబం అలా కాదు. మాట తప్పని, మడమ తిప్పని నైజం వారిది. నమ్మిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్దపడతారని తెలిపారు.
బాబు హయాంలో బీసీలకు ఒరిగిందేం లేదని ఆరోపించారు. బీసీలకు తగు న్యాయం జరగాలంటే అది కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని తెలిపారు. అందుకే ప్రజా సంకల్ప యాత్ర అనంతరం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో బీసీ గర్జన సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాక త్వరలోనే బీసీ అధ్యాయన కమిటీ నివేదికను జగన్మోహన్ రెడ్డికి అందచేయనున్నట్లు తెలిపారు.
బీసీలకు న్యాయం చేసేది జగన్ మోహన్ రెడ్డి : ఆకేపాటి అమరనాథరెడ్డి
జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందని బీసీలు విశ్వసిస్తున్నారని రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి తెలిపారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అనే విశ్వాసం ప్రజల్లో పాతుకుపోయిందని అన్నారు. అందుకే కేవలం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో బీసీలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.