
పట్నా : సొంతపార్టీలోని అగ్రనేతలు బీజేపీకి కొరకరాని కొయ్యలా మారారు. ఆ పార్టీలో జరుగుతున్న తప్పులను వారే స్వయంగా ఎత్తి చూపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ విధానం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందంటూ నేరుగా విమర్శల దాడి చేసిన బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోసారి బాంబులాంటి విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా కుమారుడిపై అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్లయిందన్నారు.
'పలు పొరపాట్ల కారణంగా బీజేపీ ఇప్పుడు గిల్టీగా ఉన్నట్లు కనిపిస్తోంది. వ్యాపారవేత్త అయిన జై షా కోసం ప్రభుత్వ ఉన్నత న్యాయవాది అయిన తుషార్ మెహతాను కోర్టులో దించడం సరికాదు' అని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జై ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయంటూ ది వైర్ అనే ఓ వెబ్ సంస్థ కథనం వెలువరించిన నేపథ్యంలో దానిపై రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును వాధించడానికి ప్రభుత్వ న్యాయవాది అయిన తుషార్ మెహతాను రంగంలోకి బీజేపీ దించింది. దీనిని యశ్వంత్ సిన్హా తప్పుబట్టారు. 'విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్ గోయల్ అమిత్ షా కుమారుడికి రుణాన్ని మంజూరు చేసిన విధానం, ఆ తర్వాత ఆయననే వెనుకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించాలి. ఇందులో చాలా శాఖలు జోక్యం చేసుకున్నట్లు అనిపిస్తోంది' అంటూ ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment