న్యూఢిల్లీ : ఎన్ని విమర్శలు వచ్చినా మగానుభావులు మాత్రం మారడం లేదు. నిన్ననే కాంగ్రెస్ మిత్రపక్షం నేత ఒకరు స్మృతి ఇరానీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. అది ఇంకా పూర్తిగా ఆరకముందే ఈ రోజు బీజేపీ నాయకులు రెడీ అయిపోయారు. ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ స్కర్ట్స్ ధరించే వారు ఇప్పుడు చీరలు కట్టుకుని ఆలయాలకు వెళ్తున్నారు. గంగానదికి పూజలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకుడు జయకరణ్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కొన్ని రోజుల క్రితమే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీలు, బోటు యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పలు ఆలయాలను సందర్శించడమే కాక గంగానదికి పూజలు చేసి హారతి కూడా ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జయకరణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జయకరణ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘అచ్చెదిన్ ఎక్కడ అని ప్రశ్నించే కాంగ్రెస్ నాయకులు దాన్ని చూడటంలేదు. గతంలో స్కర్ట్స్ వేసుకుని ఆలయాలకు వెళ్లి గంగానదిని అగౌరవపర్చిన వారు నేడు చీరలు ధరించి అదే గంగానదికి పూజలు చేసి మర్యాద ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే జయకరణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో జయకరణ్ తాను ప్రత్యేకంగా ఏ రాజకీయనాయకుడి పేరుని పేర్కొనలేదని.. జనరల్‌గా చెప్పానని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో ప్రియాంక గాంధీ, సోనియా గాంధీని విమర్శించే వారి జాబితాలో జయకరణ్ కూడా చేరారు.
Comments
Please login to add a commentAdd a comment